డివైన్స్ కామెడీ

తాగుబోతుల్లో క్రియేటివిటీ ఎక్కువ‌. మందు కొడితే బుర్ర పాద‌ర‌సంలా ప‌ని చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో బ్రీత్ ఎన‌లైజ‌ర్‌ని పోలీసుల నుంచి లాక్కుని పారిపోయే ఐడియా అందుకే వ‌చ్చింది. తాగితే డ్రైవ్ చేసేది…

తాగుబోతుల్లో క్రియేటివిటీ ఎక్కువ‌. మందు కొడితే బుర్ర పాద‌ర‌సంలా ప‌ని చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో బ్రీత్ ఎన‌లైజ‌ర్‌ని పోలీసుల నుంచి లాక్కుని పారిపోయే ఐడియా అందుకే వ‌చ్చింది. తాగితే డ్రైవ్ చేసేది మ‌ద్య‌మే త‌ప్ప మ‌నిషి కాదు.

తాగితే మ‌రిచిపోగ‌ల‌ను అనే క‌వి హృద‌యం నిజం కాదు. విస్కీ న‌రాల్లో క‌రెంట్‌లా ప్ర‌వ‌హిస్తే పాత‌వ‌న్నీ గుర్తుకొస్తాయి. పూల‌కుండి ఎందుకు త‌న్నావ్ చెప్పు అని త‌న్నుకుంటారు. గాయ‌ప‌డితే ఎన‌స్తీషియా కూడా అవ‌స‌రం వుండ‌దు.

తాగుబోతుల ఆదాయంతో ప్ర‌భుత్వాలు నిల‌బ‌డ‌తాయ‌ని తెలుసు కానీ, వాళ్ల శాపాల‌తో కూలిపోతాయ‌ని మొన్న‌నే తెలిసింది. మందుతో లాంగ్వేజీ, బాడీ లాంగ్వేజీ రెండూ మారిపోతాయి. క‌ప్ప‌లా గెంత‌డం, పాములా పాక‌డం, కుక్క‌లా మొర‌గ‌డం అన్నీ ఏక‌కాలంలో సాధ్యం. ఏబీసీడీల‌ని ఎప్పుడూ చూడ‌క‌పోయినా అన‌ర్ఘ‌ళ‌మైన ఇంగ్లీష్ ప్ర‌వ‌హిస్తుంది. ఆ వాక్యాల్లో వ్యాక‌ర‌ణాన్ని ప‌సిగ‌ట్ట‌డం పండితుల వ‌ల్ల కూడా కాదు.

యుద్ధం -శాంతి అనే పెద్ద న‌వ‌ల‌ని అన‌వ‌స‌రంగా టాల్‌స్టాయ్ రాసాడు కానీ, ఏ మందు బాబుని అడిగినా న‌వ‌ల సారాంశాన్ని ఒక్క ముక్క‌లో చెప్ప‌గ‌ల‌డు.

వైఫ్ వ‌ల్ల యుద్ధం – వైన్స్ వ‌ల్ల శాంతి

అన్ని షాఫుల‌కి వైన్స్ అని పేరు వుంటుంది కానీ, నూటికి 99 షాపుల్లో వైన్ దొర‌క‌దు. కొంత మంది భ‌క్త వ్యాపారులు దేవుడి పేర్లు పెట్టుకుంటారు. తిరుమ‌ల వైన్స్‌, శివ వైన్స్ ఇలా ఎవ‌రి దేవుడి పేరు వాళ్లు. హైద‌రాబాద్ మ‌ణికొండ‌లో “తాగేసిపో” అనే బార్ వుంది.

మందులో వున్నంత పొదుపు, స్పృహ ఇంకెక్క‌డా వుండ‌దు. ఒక్క చుక్క కూడా వృథా చేయ‌రు. చివ‌రి బిందువుల్ని ల‌క్కీ డ్రాప్స్ అంటారు. బార్‌లో స్నేహం కూడా బ‌లీయంగా వుంటుంది. ఎప్పుడూ చూడ‌ని వాళ్లు మిత్రుల‌వుతారు. విస్కీ సోడాల్లా క‌ష్ట‌సుఖాలు క‌ల‌బోసుకుంటారు. విడిపోతున్న‌ప్పుడు ఫోన్ నంబ‌ర్లు తీసుకుంటారు. తెల్లారి ఆ నంబ‌ర్ ఎవ‌రిదో గుర్తు వుండ‌దు.

ఒక ద‌ర్శ‌కుడు మందు తాగి అనేక మంది కొత్త న‌టుల‌కి అవ‌కాశం ఇస్తుంటాడు. తెల్లారి ఒక్క‌రి ఫోన్ కూడా లిప్ట్ చేయ‌డు.

మందుకి ఆహ్వానించే వాళ్ల‌లో కొంద‌రు కొంగ బావ‌లుంటారు. మ‌నం ఒక పెగ్గు తాగేలోపు సీసా ఖాళీ చేస్తారు. బిర్యానీ తినేస్తారు. మందు తాగ‌ని వాన్ని పార్టీకి పిలిస్తే డేంజ‌ర్‌. కన్ను మూసి తెరిచే లోగా జీడిప‌ప్పు, క‌బాబులు మాయ‌మై పోతాయి.

మందు వ‌ల్ల వేదాంత దృష్టి కూడా అల‌వ‌డుతుంది. ఈ ప్ర‌పంచం త‌ల‌కిందులుగా ఎందుకు వుందో అర్థ‌మ‌వుతుంది. జీవితం క్ష‌ణిక‌మ‌ని సోడా మీద వ‌చ్చే బుడ‌గ‌లు చెబుతాయి. మ‌త్తు వ‌ల్ల క‌ళ్లు స‌గ‌మే క‌నిపిస్తాయి. దృష్టి కోణం స‌వ‌రించుకోవ‌చ్చు. గ‌ట్టిగా న‌వ్వ‌డం, లేదా ఏడ్వ‌డం వ‌ల్ల సుఖ‌దుఃఖాలు స‌మాన‌మ‌ని గ్ర‌హించవ‌చ్చు.

రాత్రి ఓవ‌ర్ అయితే తెల్లారి హ్యాంగోవ‌ర్‌. అది త‌గ్గాలంటే మ‌ళ్లీ మందు తాగాలి. తాగుడు దైవ ద‌త్తం. దేవ‌త‌లు కూడా సోమ‌ర‌సం సేవించిన‌ట్టు పురాణాల్లో వుంది. తాగిన వాళ్లు ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఇల్లు మ‌రిచిపోతారు. ఇంట్లో గ‌రుడ పురాణం వేచి వుంటుందని తెలుసు.

ర‌ష్య‌న్లు గొప్ప సాహిత్యం రాయ‌డానికి కార‌ణం వాళ్ల పేరులోనే విస్కీ వుంది కాబ‌ట్టి.

జీఆర్ మ‌హ‌ర్షి