గతి తప్పిన ’అతి‘ పక్షం!

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకోవాలి. ప్ర‌జాస‌మ‌స్య‌ల గురించి మాట్లాడాలి. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి! అయితే తెలుగుదేశం పార్టీ ప్ర‌స్తుతం అలాంటి ప్ర‌య‌త్నాలు చేసే ఉత్సాహంలో కానీ, ఆలోచ‌న‌తో కానీ క‌న‌ప‌డ‌దు. చంద్ర‌బాబు నాయుడు,…

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకోవాలి. ప్ర‌జాస‌మ‌స్య‌ల గురించి మాట్లాడాలి. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి! అయితే తెలుగుదేశం పార్టీ ప్ర‌స్తుతం అలాంటి ప్ర‌య‌త్నాలు చేసే ఉత్సాహంలో కానీ, ఆలోచ‌న‌తో కానీ క‌న‌ప‌డ‌దు. చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ నాయుడుల నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం పార్టీ.. అధికారానికి ఆశిస్తోంది. ఆశించ‌డంలో త‌ప్పు లేదు.. అయితే షార్ట్ క‌ట్ లో అధికారాన్ని ఆశిస్తోంది! అన్నీ అడ్డ‌దారి పోక‌డ‌ల‌నే టీడీపీ న‌మ్ముకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. 

విజ‌యానికి షార్ట్ క‌ట్ అంటూ ఏదీ ఉండ‌ద‌ని ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్ మెంట్ నిపుణులు ప‌దే ప‌దే చెబుతూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం.. అడ్డ‌దారులు, ప‌గ‌టి క‌ల‌లు కంటూ, ఇవి కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డంతో అస‌హ‌నానికి లోన‌వుతూ ఉంది. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నుంచి ప‌చ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్య‌క‌ర్త వ‌ర‌కూ ఇదే అస‌హ‌న‌మే!

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మితో వీరి ఇగో హ‌ర్ట్ అయ్యింది. అక్క‌డితో మొద‌లు.. అడుగ‌డుగునా టీడీపీ అస‌హ‌నం ప‌తాక స్థాయికి చేరుతూ ఉంది. ప్ర‌జ‌ల‌కు చేరువ‌కాల్సిన ప‌రిస్థితుల్లో ఆపనిని మ‌రిచిపోయి.. అడ్డ‌గోలు వ్యూహాల‌తో, అనాలోచిత చ‌ర్య‌ల‌తో, అహంకార‌పూరిత మాట‌ల‌తో తెలుగుదేశం పార్టీ దారి త‌ప్పి సాగుతూ ఉంది. ఈ దారిలో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా వెళ్లాలనే దిశానిర్దేశాన్ని చేస్తోంది ఆ పార్టీ నాయ‌క‌త్వం. 

ఈ ప‌రిస్థితుల్లో.. టీడీపీ దుందుడుకు చ‌ర్య‌లు ఆ పార్టీ చేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ గా మారుతున్నాయి. తమ‌ను సోలోగా ఓడించిన జ‌గ‌న్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌డాన్ని కొన‌సాగిస్తున్న టీడీపీ, ఇదే మూడ్ లో జ‌నాల‌ను కూడా పూర్తిగా త‌క్కువ అంచ‌నా వేస్తూ.. ఉనికిని కోల్పోయే దిశ‌గా అడుగులు వేస్తోంది!

జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసేయ్యాలి.. అధికారం అప్ప‌గించాలి!

వీరిది వెర్రో, పిచ్చో కానీ.. ప్ర‌తి రోజూ ఇదే వాద‌నే. ఈ వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌చ్చినా ఇదే డిమాండే!  ప్ర‌జ‌లు అఖండ మెజారిటీతో ఎన్నుకున్న ఒక పార్టీ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాలంటూ అనునిత్యం డిమాండ్ చేయ‌డమేనా! ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి చ‌ర్య‌లుంటాయా? 151 సీట్లున్న ఒక రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డ‌మంటే అది చిటికెల పందిరి వేసినంత సుల‌భ‌మా? అధికారం అంటే అది ప్ర‌జ‌లు ఇవ్వాల‌నే విష‌యాన్ని మరిచి, కేంద్రం క‌లుగ చేసుకోవాల‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని, రాష్ట్రప‌తి పాల‌న పెట్టాల‌ని టీడీపీ డిమాండ్ చేయ‌ని రోజంటూ లేక‌పోతోంది. 

అయిన‌దానికీ కాని దానికీ ఇలాంటి డిమాండ్ చేయ‌డం ద్వారా.. తెలుగుదేశం పార్టీ ఒక కామెడీ పీస్ గా మారిపోతూ ఉంది. ఆ పార్టీ అధినేతే ఈ కామెడీ డిమాండ్లు చేస్తూ ఉంటారు. ఇక చంద్ర‌బాబు భ‌క్తులు.. ఈ విష‌యంలో హ‌ద్దు మీరిపోతూ ఉంటారు. ఏతావాతా.. తెలుగుదేశం పార్టీ ఒక ఫూల్స్ ప్యారడైజ్ గా మార‌డంలో పెద్ద వింత లేదు. త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌భుత్వం ఉంటే.. దాన్ని కేంద్రం ర‌ద్దు చేసిపారేయాల‌నేంత పిచ్చి ముదిరిపోయింది ప‌చ్చచొక్కాల‌కు! రాష్ట్ర విడిపోయాకా.. ప్ర‌జ‌లు ఐదేళ్ల అధికార కాలాన్ని అప్ప‌గిస్తే.. దాంతో తామేం చేశామ‌నే మాట‌ను మ‌రిచి, ప్ర‌జ‌లే ఎన్నుకున్న మ‌రో ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే ర‌ద్దు చేయాలి, 

జ‌గ‌న్ అరెస్ట‌వ్వాలి, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కావాలి, ప్ర‌భుత్వాన్ని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి, రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలి, చంద్ర‌బాబును సీఎంగా చేయాల‌నే.. పిచ్చి నినాదాల‌ను తెలుగుదేశం పార్టీ న‌మ్ముకుంది. ప్ర‌తిప‌క్ష పార్టీ చేయాల్సిన ప‌ని కాదు ఇది. గ‌తంలో ఏపీలో ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా ఈ పిచ్చి నినాదాల‌ను, మ‌తి చ‌లించిన పిలుపుల‌ను, విన్న‌పాల‌ను చేయ‌లేదు! కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న‌ప్పుడు ఆ పార్టీ వాళ్లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు.  

వైఎస్ పాద‌యాత్ర చేశారు, చంద్ర‌బాబును దించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు కానీ, కేంద్రాన్ని కాదు!  జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా పాద‌యాత్ర అంటూ త‌న రెండు పుట్టిన రోజుల‌ను పాద‌యాత్ర‌లోనే జ‌రుపుకున్నారు, ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే జ‌రుపుకున్నారు కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని నిరాహార దీక్ష‌లు చేయ‌ప‌ట్టలేదు! మ‌రి ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా చేయ‌ని వెర్రి డిమాండ్ ను త‌మే ప‌దే ప‌దే చేస్తున్నామంటే, త‌మ మానసిక స్థితి ఏమిటో తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సి ఉంది. 

వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో గెలిచాకా.. బీజేపీ శ్రేణుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఢిల్లీ లెవ‌ల్లో ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌రే ఈ విష‌యంలో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి అక్క‌డ కూడా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాలి, రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలి, హోం మంత్రి పాలించాల‌నే డిమాండ్ గ‌ట్టిగా లేదు! ఏతావాతా ఈ వెర్రి డిమాండ్ టీడీపీది మాత్ర‌మే!

ఒక‌ట‌ని కాదు అన్నీ అంతే!

ప్ర‌తిప‌క్షంలో ఉంటే.. ప్ర‌తిప‌క్ష పార్టీ ప్రాధాన్య‌త గురించి చెబుతారు, ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న అనుభ‌వాన్ని సంవ‌త్స‌రాల లెక్క‌లో రోజుకోసారి చెప్పుకుంటారు! అదే అధికారంలో ఉంటే మాత్రం ప్ర‌తిప‌క్షాలు క‌న‌ప‌డ‌వు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అన్నింటికీ అఖిల‌ప‌క్ష స‌మావేశం కావాలంటారు, అదే అధికారంలో ఉంటే.. అలాంటిది ఒక‌టి ఉంటుంద‌ని తెలియ‌ద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తారు.  త‌న‌కు మించిన మేధావి లేడంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు సోష‌ల్ మీడియా పోస్టుల‌కు అరెస్టులు చేస్తారు, అధికారంలో లేక‌పోతే మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడ‌తారు! అధికారంలో ఉంటే.. కేంద్రం క‌ల‌గ‌చేసుకోకూడ‌దంటారు. 

అది పోతే.. కేంద్ర‌మే దిక్కంటారు! మ‌రీ ఇంత ప‌చ్చి అవ‌కాశ‌వాదాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటే ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటారు అని చంద్ర‌బాబుకు ఇప్ప‌టికీ అర్థం కాక‌పోవ‌డం, అదే దారే క‌రెక్ట‌ని ఆయ‌న త‌న‌యుడు అనుకుంటూ ఉండటం తెలుగుదేశం పార్టీ పాలిట శాపంగా మారుతోంది. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అందుకోలేక‌పోవ‌చ్చు.. అన‌డానికి, మ‌రే ఆధారం అక్క‌ర్లేదు. 

చంద్ర‌బాబు మాట‌లు, ఆయ‌న అనుస‌రించే అవ‌కాశ‌వాదం, షార్ట్ క‌ట్లో సీఎం అయిపోవాల‌ని ఆయ‌న త‌న‌యుడు ఆరాట ప‌డుతూ ఉండ‌టం.. ఇవ‌న్నీ చాలు! అధికారంలో ఉన్న‌ప్పుడు ఎంత అహంకారంతో వ్య‌వ‌హ‌రించారో, ఇప్ప‌టికీ ఆ అహం చంద్ర‌బాబు చుట్టూ ఉన్న వాళ్ల‌లో త‌గ్గ‌లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీకి ఏ ల‌క్ష‌ణాలు అయితే ఉండ‌కూడ‌దో..  అవ‌న్నీ టీడీపీలో క‌నిపిస్తూ ఉన్నాయి. చంద్ర‌బాబు అవ‌కాశ‌వాద రాజ‌కీయం, లోకేష్ అహంకార నైజం.. ఇవి చాలు టీడీపీని శాశ్వ‌తంగా అధికారానికి దూరం ఉంచ‌డానికి!

విధానాల సంగ‌తేంటి?

అస‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా తెలుగుదేశం గ‌త రెండున్న‌రేళ్ల‌లో ఏమేం మాట్లాడింది, ఎలా వాదించింది, ఆ త‌ర్వాత ఆ వాద‌న‌ల‌ను, ఆ అంశాల‌ను ఎలా ప‌క్క‌న పెట్టింద‌నే అంశాన్ని గ‌మ‌నిస్తే.. ఆ పార్టీ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుంది. అంశాల వారీగా వాటిని ప‌రిశీలిస్తే..

-ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే ఈవీఎంల‌ను అనుమానించారు. ఈవీఎంలు వ‌ద్ద‌న్నారు. ఈవీఎంల ట్యాంప‌రింగ్ అన్నారు. ఫ‌లితాల‌కు ముందు ఈవీఎంల మీద కోర్టుకు వెళ్లారు. ఒక‌వైపు దేశంలో టెక్నాల‌జీకి త‌నే పితామ‌హుడిని అని చెప్పుకుంటూ, మ‌ళ్లీ త‌నే ఈవీఎంల మీద కోర్టుకు వెళ్లిన ఘ‌న చ‌రిత్ర చంద్ర‌బాబుది. తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం, ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.  మ‌ళ్లీ ఈవీఎంల మీద కిక్కురుమ‌న‌లేదు. ఈవీఎంల‌పై ఏమైనా మాట్లాడితే మోడీ ప్ర‌భుత్వం ఎక్క‌డ తీసుకెళ్లి లోప‌ల‌ప‌డేస్తుందో అని చంద్ర‌బాబు భ‌యంలా ఉంది. అందుకే ఫ‌లితాలు వ‌చ్చాకా.. ఈవీఎంల‌ను అనుమానించే సాహ‌సం లేదు!

-జ‌గ‌న్ ను చూసి బ‌య‌టెవ‌రూ రాష్ట్రానికి అప్పులు కూడా ఇవ్వ‌ర‌ని స్వ‌యంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు హేలన చేశారు. అదే త‌మ‌ను చూస్తే అప్పులిస్తారు అని చెప్పుకోవ‌డం వారి ఘ‌న‌కీర్తి. అయితే ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పులు విప‌రీతంగా చేస్తోంద‌ని వాపోతున్నారు!

-జ‌గ‌న్ ప్ర‌భుత్వం పంచేస్తోంది.. పంచేస్తోంది.. అని త‌ట‌స్థుల ముసుగులోని ప‌చ్చ చొక్కాలు వాపోతుంటాయి. సోష‌ల్ మీడియాలో ఈ ప్ర‌చారం చేస్తూ ఉంటాయి. మ‌రి తాము అధికారంలోకి వ‌స్తే.. ఈ సంక్షేమ ప‌థ‌కాల‌కు బ్రేక్ వేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌రు! వీరు అధికారంలో ఉన్న‌ప్పుడు చేప‌ట్టిన అన్నా క్యాంటీన్లు, పండ‌గ‌ల‌కు పంచిన ప‌ప్పు బెల్లాల క‌థేమిటి? అంటే స‌మాధానం ఉండ‌దు!

–  బొగ్గు కొరత వ‌ల్ల దేశం మొత్తం మీద కరెంటు క‌ష్టాలు వస్తే , జగన్ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్ల అని ప్రచారం చేశారు. కరెంటు కోతలు వస్తున్నాయంటూ ప్ర‌జ‌ల‌ను బెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. బొగ్గు కొర‌త అంశం గురించి మీడియాలో కూడా చ‌ర్చ జ‌రిగి, దేశంలోని వివిధ రాష్ట్రాలు స్పందించ‌డంతో టీడీపీ గోబెల్స్ ప్ర‌చారానికి చెక్ ప‌డింది!

-గుజ‌రాత్ తీరంలో దొరికిన డ్ర‌గ్స్ కు ఏపీతో ముడిపెట్టారు. తాడేప‌ల్లిలోని సీఎం ఆఫీసుకు డైరెక్టుగా డ్ర‌గ్స్ వ‌స్తున్నాయంటూ ప్ర‌చారం చేశారు. ఏది చెప్పినా తాడికొండ మిరియాలంత అని చెప్ప‌డం టీడీపీకి అల‌వాటుగా మారింది. తీరా పోలీసుల నోటీసులు వ‌స్తే.. వారిని బూతులు తిట్ట‌డం, త‌మ నోటికి హ‌ద్దే లేద‌ని టీడీపీ ఇలా చాటుకుంటూ ఉంది.  

-స్థానిక ఎన్నిక‌ల‌తో రాజ‌కీయం స‌రేస‌రి. నాటి ఎన్నిక‌ల అధికారాని అడ్డం పెట్టుకుని ఏడాది పాటు అదో ర‌చ్చ‌గా సాగించారు. తీరా వారు కోరుకున్న‌ట్టుగానే స్థానిక ఎన్నిక‌లు జ‌రిగి టీడీపీ చిత్త‌య్యాకా కానీ త‌త్వం బోధ‌ప‌డ‌లేదు. అహానికి వెళ్లి, త‌మ‌కు కావాల్సిన అధికారి ఉండ‌గానే ఎన్నిక‌లు జ‌రిగితే ఏదో అయిపోతుంద‌ని , జ‌గ‌న్ కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని లెక్క‌లేశారు. తీరా ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ స‌త్తా బ‌య‌ట‌ప‌డింది. చిత్త‌య్యింది. దీంతో మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌ద్దు అనే వాద‌న మొద‌లు! ఆ పై బ‌హిష్క‌ర‌ణ‌. ఇలా టీడీపీ ప‌త‌నావ‌స్థ‌కు ఒక హ‌ద్దంటూ లేక‌పోయింది.

-ర‌మేష్ ఆసుప‌త్రిలో అగ్ని ప్ర‌మాదంపై ప్ర‌భుత్వ విచార‌ణ జ‌రగ‌డ‌మే పాపమైపోయింది. దాన్ని త‌మ కులంపై దాడిగా మార్చేశారు!

-అన్నింటికీ కోర్టుల‌కు ఎక్క‌డం, ప్ర‌భుత్వ విధానాల‌కు అభ్యంత‌రాల‌ను తీసుకురావ‌డం, ఆఖ‌రికి పేద‌ల‌కు పంచే ఇళ్ల విష‌యంలో కూడా అదే విప‌రీత చ‌ర్య‌ల‌కు వెళ్ల‌డం..ఇవ‌న్నీ త‌మ విజ‌యాలుగా టీడీపీ అనుకుంటోందేమో. ఇవి ఎన్నిక‌ల అధికారిని అడ్డం పెట్టుకుని చేసిన రాజ‌కీయం లాంటివే అని ఆ పార్టీకి అర్థం కావ‌డం లేదు!

-మ‌త రాజ‌కీయానికీ వెనుకాడ‌లేదు. ఆల‌యాల‌పై దాడులు అంటూ, శ్రీవారి ఆల‌యం విష‌యంలోనూ అస‌త్య ప్ర‌చారానికి వెనుకాడ‌క‌పోవ‌డం ఆ పార్టీ రెండున్న‌రేళ్ల ఫెయిల్యూర్ స్టోరీలోని ప్ర‌ముఖ‌మైన అంశాలే.

-రెండు క‌ళ్ల సిద్ధాంతాలు, చీక‌టి పొత్తులు, స్నేహాలు.. ఇవి చంద్ర‌బాబు పొలిటిక‌ల్ హిస్ట‌రీలో కొత్త‌వేమీ కాక‌పోవ‌చ్చు. అయితే వీటితో ప్ర‌జ‌లు విసిగెత్తిపోయిన ద‌శ‌లో కూడా ఆయ‌న వాటినే న‌మ్ముకున్నారు.

-కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌రు. గ‌తంలో 2004-09ల మ‌ధ్య‌న త‌నేదో జాతీయ నాయ‌కుడిని అయిన‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి అంశం మీదా స్పందించేవారు. అప్పుడు ఐదు మంది ఎంపీలే ఉన్నా..  కేంద్ర విధానాల‌న్నింటి మీదా స్పందించేవారు. సోనియాపై ఎడా పెడా మాట్లాడారు. మ‌న్మోహ‌న్ ను అవ‌మానించేలా మాట్లాడారు. ఆ త‌ర్వాత సోనియా ఇంటి ముందు నిల‌బ‌డ్డారు. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వ విధానాల్లో ఒక్క‌దాన్ని వ్య‌తిరేకించేంత ధైర్యం చంద్ర‌బాబుకు లేదు. సాగు చ‌ట్టాల విష‌యంలో దేశంలోని ఎన్డీయేత‌ర పార్టీల‌న్నీ బంద్ కు ముందుకు వెళితే, టీడీపీ కిక్కురుమ‌న‌లేదు!

జ‌గ‌న్ అరెస్ట‌వుతాడంటూ.. ఇదో పాట‌!

ఏ పార్టీ అయినా.. త‌న క్యాడ‌ర్ ను ఎలా సంతృప్తిగా ఉంచ‌గ‌ల‌దు?  వారిని ఎలా ఉత్తేజం చేయ‌గ‌ల‌దు.. అంటే రాబోయే రోజుల్లో అధికారం త‌మ‌దే అని ఊర‌ట‌ను ఇస్తూ ఉంటుంది. ఆ పార్టీ నాయ‌క‌త్వం అధికారం అందుకుంటామ‌నే విశ్వాసాన్ని శ్రేణుల్లో క‌లిగించి ఉత్తేజ ప‌రుస్తూ ఉంటారు. మ‌రి టీడీపీ అధినేత‌, ఆ పార్టీ నేత‌లు క‌లిగించే ఉత్తేజం, పార్టీ శ్రేణుల‌కు క‌లిగించే ఉత్సాహం ఎలాంటిది అంటే, తాము అధికారాన్ని అందుకోబోతున్నామ‌ని కాదు.. అదిగో జ‌గ‌న్ అరెస్ట‌వుతాడు, ఇదిగో జ‌గ‌న్ ను అరెస్టు చేయ‌బోతున్నారు.. అంటూ.. రెండున్న‌రేళ్లుగా ఇదే పాట‌!  

ఇలా చెబుతుంటే.. త‌మ పార్టీ శ్రేణుల‌కు జోల పాడిన‌ట్టుగా ఉంటుంద‌ని టీడీపీ నేత‌లు లెక్క‌లేస్తుంటారు. అర‌గంట సేపు టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో కూడా రోజుకోసారి ఈ మాట త‌ప్ప‌కుండా చెప్ప‌డం అనేంత మూర్ఖ‌త్వం, మ‌త్తులో టీడీపీ నేత‌లు మునిగిపోయారు! జ‌గ‌న్ అరెస్టు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అస్థిర‌త్వం వ‌స్తుంది, అప్పుడు ఆబ‌గా మ‌నం అధికారం అందుకోగ‌లం త‌ప్ప‌.. ప్ర‌జ‌లు మ‌న‌కు అధికారాన్ని అప్ప‌గిస్తార‌నే మాటను ఇంత ధీమాగా చెప్ప‌లేక‌పోతోంది టీడీపీ. 

ఇక కొన్నాళ్లేమో అవిగో ఎన్నిక‌లు, ఇవిగో ఎన్నిక‌లు.. అంటూ ఊరించారు. తీరా.. తిరుప‌తి ఉప ఎన్నిక వ‌స్తే.. అక్క‌డ సానుభూతి అభ్య‌ర్థిని కాకుండా మ‌రో అభ్య‌ర్థిని వైఎస్ఆర్సీపీ నిల‌బెడితే, టీడీపీ క‌నీసం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ఇక బ‌ద్వేల్ బై పోల్ కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి, మ‌ళ్లీ వెన‌క్కు త‌గ్గారు. ఎంపీటీసీ- జ‌డ్పీటీసీ ఎన్నిక‌లను అయితే నామినేష‌న్ల త‌ర్వాత బ‌హిష్క‌రించిన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్నారు. ఇదీ టీడీపీ తీరు.

మైన‌స్ ల‌నే ప్ల‌స్ ల‌నే భ్ర‌మ‌ల్లో చంద్ర‌బాబు!

తెలంగాణ‌లో కాంగ్రెస్  తో స్నేహం, మ‌రోవైపు జ‌న‌సేన‌తో ర‌హ‌స్య‌బంధం.. క‌మ్యూనిస్టుల‌ను కార్డు ముక్క‌ల్లా వాడుకోవ‌డం.. వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేయ‌డం.. ఈ చ‌ర్య‌ల‌న్నీ త‌న పార్టీ బలోపేతానికి, త‌ను మ‌ళ్లీ అధికారాన్ని అందుకోవ‌డానికి సోపానాలు అని చంద్ర‌బాబు నాయుడు అనుకుంటున్న‌ట్టుగా ఉన్నారు. అయితే.. ఇవ‌న్నీ రివ‌ర్స్ ఫ‌లితాల‌ను ఇచ్చేలా ఉన్నాయి. త‌ను చేస్తున్న ఈ కుటిల రాజ‌కీయాలు తెలుగుదేశాన్ని అధికార తీరాన్ని చేర్చ‌డం అటుంచి, ప‌త‌నావ‌స్థ‌కు తీసుకెళ్తున్నాయి. 

ఆఖ‌రికి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు వ‌స్తే వాటిని బ‌హిష్క‌రించామ‌ని, అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాకా.. మాన‌వీయ కోణంలో త‌ప్పుకున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం వ‌ర‌కూ వ‌చ్చింది తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి. ప్ర‌జ‌లు ఓటేసే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం మాట అటుంచి, క‌నీసం పోటీకి కూడా పున‌రాలోచించుకునేంత స్థితికి దిగ‌జారిపోయింది. ఇదీ రెండున్న‌రేళ్లుగా ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ అందుకున్న స్థితి! చాలా క్రూయ‌ల్, క‌న్నింగ్ ప్రాక్టీసెస్ తో చంద్ర‌బాబు నాయుడు త్వ‌రలోనే ఆ పార్టీని ఉనికే ఊసులో లేకుండా చేసేట్టుగా ఉన్నారు.  

ఆల్రెడీ తెలంగాణ‌లో తెలుగుదేశం అడ్ర‌స్ మాయం అయిన రీతిలోనే.. ఏపీలో కూడా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో తెలుగుదేశం అదే ప‌రిస్థితిని ఎదుర్కొనే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.